మంచి ఒడ్డూ పొడుగూ... బొంగరాల్లాంటి కళ్ళు..... గింగిరాలెత్తించే నడుము ఒంపులు.... ఇన్ని అందాలూ బాపూగారి బొమ్మగా పేరొందిన ప్రణీత సొంతం. ‘అత్తారింటికి దారేది’ తరువాత ప్రణీత ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. ఎవరి అంచనాలూ నిజం కాలేదు. తక్కువ సినిమాలే చేసింది. కారణం అవకాశాలు రాక కాదు నచ్చక అంటున్న ప్రణీతతో...
‘డైనమైట్’ తమిళ మాతృక చూశారా?
చూశాను. ఆ వర్షన్ బాగా నచ్చింది. ఆ సినిమాకీ, ఈ సినిమాకీ చాలా తేడా ఉంది. తెలుగులో వచ్చేసరికి ఇక్కడికి అనుకూలంగా మార్పులు చేర్పులు చాలా చేశారు. సినిమా చూస్తే ఆ విషయం మీకు బాగా అర్థమవుతుంది.
‘డైనమైట్’లో ఇంత వరకూ చేయని క్యారక్టర్ చేసినట్టున్నారు?
అవును. గతంలో మోడ్రన్ గర్ల్గా చాలా సినిమాల్లో చేశాను. కానీ ఇందులో నా ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అదే నన్ను కష్టాల్లో పడేస్తుంది. వాటి నుంచి ఎలా గట్టెక్కాను అన్నది మీరు చూస్తేనే తెలుస్తుంది.
గతంలో ఎన్నడూ చేయని ఫైట్లు చేసినట్టున్నారు?
చెప్పానుగా డిఫరెంట్ క్యారక్టర్ అని. ఫైటింగ్ సీన్లు చేసేటప్పుడు చేతులకు, కాళ్ళకు గాయాలు అయ్యాయి. అయినా ఆ గాయాలు నన్ను బాధించలేదు. అవన్నీ ఇష్టంగా చేసినవే!
ఫైట్లు చేయడం అంటే భయం అనిపించలేదా?
ఎందుకు భయం? ఒకప్పుడు భయపడేవారేమో కానీ, ఇప్పటి హీరోయిన్లకు అలాంటి భయాలేవీ ఉండడం లేదు. హీరోలతో సమానంగా ఫైట్లు చేస్తున్నారు. దెబ్బలూ తగిలించుకుంటున్నారు. కాకపోతే ఫైటింగ్ సీన్ల సమయంలో మామూలు కన్నా కూడా కొద్దిగా ఎక్కువ రిహార్సిల్స్ చేయవలసి వచ్చింది.
బాగా కష్టపడి చేసిన సీన్?
అన్నీ కష్టపడి చేసినవే!
సోలో హీరోయిన్గా తక్కువ సినిమాలు చేయడానికి కారణం?
నచ్చిన పాత్ర దొరకకపోవడం వలనే ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయ లేకపోతున్నాను. ఈ గ్యాప్లో శాండిల్వుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్నాను.
నచ్చిన పాత్ర అంటే ఎలాంటి పాత్రలు?
పాత్ర నిడివి ఎప్పుడూ చూడను. నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందా? లేదా? అన్నదే చూస్తాను. అదే సమయంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్నా పెద్దగా పట్టించుకోను. ‘డైనమైట్’లో నా పాత్ర చూడండి. నా ఫైటింగ్ సీన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్లో ‘క్వీన్’, ‘ఎన్హెచ్4’ సినిమాలకు వచ్చినంత ఆదరణ వస్తుందని అనుకుంటున్నాను. అలాగే ‘రాక్షసుడు’లో నా పాత్ర చిన్నదే అయినా, చాలా మంచి పేరు వస్తుందని ఆశపడుతున్నాను.
టాలీవుడ్లో స్పీడ్ పెంచినట్టున్నారు?
స్పీడు అని కాదు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. మరికొన్ని కథలు వినడం జరిగింది.
తెలుగు వచ్చేసినట్టేనా?
గతంలో కన్నా బెటరే! అన్నీ అర్థమవుతున్నాయి. చిన్న చిన్న పదాలు పలకడానికి ప్రయత్నిస్తున్నాను. నా డబ్బింగ్ నేను చెప్పుకోవడానికి కొద్దిగా టైముంది.
మీ కో స్టార్ గురించి....
విష్ణు గురించి ఎంత చెప్పినా తక్కువే! చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. అలాగే చాలా మంచి వ్యక్తి కూడా!
మాతృభాష కన్నడంలో సినిమాలు నిర్మించడం, దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
ఇప్పట్లో అలాంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో అవకాశం వస్తే చేస్తానేమో!
ఇప్పట్లో అలాంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో అవకాశం వస్తే చేస్తానేమో!

No comments:
Post a Comment